Find Articles

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గ్రీన్ క్రాకర్స్‌కే అనుమతి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

దీపావళి వేళ ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో బాణసంచా వినియోగంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి మాత్రమే పరిమిత అనుమతి ఇచ్చింది.

నవంబర్ 7, 8 తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతించింది. అంటే రోజుకు మొత్తం మూడు గంటలు మాత్రమే బాణసంచా వినియోగించాలి. నవంబర్ 9 నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో తిరిగి పూర్తి నిషేధం అమల్లోకి రానుంది.

అలాగే ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలు, నిశ్శబ్ద ప్రాంతాలకు 300 మీటర్ల పరిధిలో బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం విధించింది.

CSIR-NEERI ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే విక్రయించాలని, ప్రతి ప్యాకెట్‌పై ప్రత్యేక క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. బేరియం కలిగిన టపాసులు, సంప్రదాయ బాణసంచా, వరుసగా పేలే టపాసుల విక్రయాలపై నిషేధం కొనసాగనుంది.

వాయు కాలుష్య నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ManaTV Team