Find Articles

‘లవ్ గురూ’గా శివగామి.. రమ్యకృష్ణ హోస్ట్‌గా డేటింగ్ రియాలిటీ షో!

‘లవ్ గురూ’గా శివగామి.. రమ్యకృష్ణ హోస్ట్‌గా డేటింగ్ రియాలిటీ షో!

రాజమాత శివగామిగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటి రమ్యకృష్ణ. తాజాగా లవ్ గురూగా ఆడియెన్స్ ను అలరించడానికి సిద్ధమయ్యారు. లవ్ ఫెయిల్ అయిన వారి కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ ‘బానిజే ఏషియా’ సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న తమిళ డేటింగ్ రియాలిటీ షో ‘సెకండ్ లవ్’కు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.ప్రేమ విఫలమై, బ్రేకప్ వల్ల కానీ, విడాకుల వల్ల కానీ బాధపడుతూ ఒంటరిగా ఉన్న 12 మంది సింగిల్స్ (యువతీ యువకులు) ఈ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొంటారు. చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, తమ జీవితంలో రెండోసారి ప్రేమను వెతుక్కునేందుకు ఈ షో వారికి ఒక వేదికగా నిలవనుంది. ఒకే విల్లాలో ఉండే ఈ కంటెస్టెంట్లు రకరకాల టాస్కులు, భావోద్వేగపూరితమైన చర్చల ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.

ఈ 12 మంది కంటెస్టెంట్ల భావోద్వేగాలను పంచుకుంటూ, వారు మళ్లీ ప్రేమకు దగ్గర కావడానికి హోస్ట్‌గా రమ్యకృష్ణ ఒక మార్గదర్శిగా తోడు నిలవనున్నారు. షో ముగిసే సమయానికి వారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ షోకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ తాజాగా విడుదల అవగా..గాయపడిన గుండెకు రమ్యకృష్ణ ప్యాచ్-అప్ చేస్తూ కనిపిస్తున్న లుక్ ప్రేక్షకులను, ముఖ్యంగా నేటి జెన్-జీ యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది.అలాగే ‘మరో అవకాశం.. మరో ప్రేమకథ’ అనే క్యాప్షన్‌తో ఈ షోపై ఆసక్తి పెరిగిపోతుంది.ఈ షో త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’లో స్ట్రీమ్‌ కానుంది.

ManaTV Team