
జబర్దస్త్ ఫేమ్ ఫైమా ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన తొమ్మిదేళ్ల ప్రేమకథకు శుభం కార్డ్ వేస్తూ, నాటకీయ పరిణామాల మధ్య ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఒక రిజిస్టర్ ఆఫీసులో ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. ఈ సందర్భంగా తన పెళ్లి వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది ఫైమా.
తమ పెళ్లికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయని, తమ పెళ్లి కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఫైమా తెలిపారు. వాళ్లు మమ్మల్ని అనుమానించారు.. నిందించారు.. మమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ఆ అడ్డంకుల్ని అధిగమించిందని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా.. అంతులేని సహనంతో భరించాం. మేం విడిపోవడానికి వేయి కారణాలు.. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ, మేము ప్రతిరోజూ కలిసి ఉండాలనే అనుకున్నాం. మొత్తానికి భార్యాభర్తలం అయ్యాం’ అంటూ తమ ప్రేమ కథలో ట్విస్ట్‌లను రివీల్ చేశారు.
జబర్దస్త్, పటాస్ వంటి కార్యక్రమాలతో పాటు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ఫైమా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. జబర్దస్త్‌లో ప్రవీణ్, ఫైమా జోడీగా నటించారు. ఆ సమయంలో వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే, గతంలో వీరి మధ్య కొన్ని వ్యక్తిగత వివాదాలు తలెత్తాయనే వార్తలు వినిపించాయి. అయినప్పటికీ, ఆ మనస్పర్థలన్నింటినీ పక్కనపెట్టి ఫైమా, ప్రవీణ్ ఇప్పుడు ఒక్కటయ్యారు. వీరి వివాహ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

