
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దే కాల్ హిమ్ ఓజీ’కి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, ఇది ‘ఓజీ యూనివర్స్’లో భాగంగా ఉండనుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ తన ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ రిలీజ్ చేసిన వీడియోలో దర్శకుడు సుజీత్, పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ఫ్రాంచైజీలోని రెండో భాగం గురించి చర్చిస్తున్నట్లుగా ఉంది. తుఫానుకు ముందు ప్రశాంతత ఉంటుంది. గంభీర చెప్పని కథ ఇప్పుడు ఆవిష్కృతం కాబోతోందని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ సీక్వెల్ కేవలం ఓ కొనసాగింపు చిత్రం కాదని, అనేక పాత్రలు, వాటికి సంబంధించిన లోతైన కథలతో కూడిన ఓ పెద్ద సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని వీడియో ద్వారా తెలుస్తోంది. ‘ఓజీ యూనివర్స్’ పరిధిని వివరిస్తూ, సుజీత్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను పవన్‌తో పంచుకున్నారు. సినిమాలో మంచు నెమ్మదిగా రక్తంగా మారే సన్నివేశం, ఓ రహస్యమైన ‘అవుట్‌సైడర్’ రోల్, ‘ఓజీ’ పెంపుడు జంతువు ప్రాముఖ్యత వంటి విషయాలను తెలిపారు. దాంతోపాటుగా ‘ఓజీ 2’లో ఓ సన్నివేశం ‘ఐకానిక్ విజువల్’గా నిలిచిపోతుందని పవన్ కల్యాణ్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో వచ్చిన ‘ ఓజీ’భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, పవన్ కల్యాణ్‌ను ఓ సరికొత్త లార్జర్ దేన్ లైఫ్ అవతార్‌లో చూపించిన సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, పవన్ కల్యాణ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజాగా ఈ సీక్వెల్ చర్చలు ‘ఓజీ యూనివర్స్’ పై అంచనాలను, ఆసక్తిని రెట్టింపు చేశాయి.

