
దేశంలోని యువతను క్రీడల దిశగా ప్రోత్సహించడంతో పాటు, క్రీడాకారులకు సముచిత గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించే పటిష్టమైన వ్యవస్థను నిర్మించాలని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. చరిత్రలో మొదటిసారిగా, 2026 ఆసియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో భారత పురుషుల జట్టు కాంస్య పతకం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు సహ యజమానిగా ఉన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..వాలీబాల్ క్రీడల్లో తాను భాగస్వామిని కావడానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. యువతను క్రీడల వైపు మళ్లించడం, క్రీడాకారులకు తగిన గుర్తింపునిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం అందరి బాధ్యతని చెప్పారు.అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏవీసీ కప్‌లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత జట్టు 3-1 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ బహ్రెయిన్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ విజయం దేశంలో వాలీబాల్ క్రీడకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.
విజయ్ దేవరకొండ కేవలం టీమ్ సహా యజమానిగానే పరిమితం కాకుండా, టీజీ20 లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే యువ క్రికెటర్లను కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ వంటి ప్రొఫెషనల్ లీగ్‌లు క్రికెటేతర క్రీడల్లోని ప్రతిభను వెలికితీయడానికి, ప్లేయర్స్ కు స్థిరమైన కెరీర్‌ను అందించడానికి ఎంతో దోహదపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

