
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోన్న తాజా చిత్రం ‘మైసా’. ఈ సినిమా కోసం ఆమె ఒక అరుదైన సాహసం చేశారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా నీటి అడుగున భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. ఈ ఫైట్ సీక్వెన్స్ ను ఎటువంటి డూప్ సహాయం తీసుకోకుండా రష్మిక స్వయంగా పూర్తిచేయడం గమనార్హం.
ఈ విషయాన్ని తెలియజేస్తూ రష్మిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు.. “నా కెరీర్లో ఇంతకంటే సవాలుతో కూడిన పని ఇప్పటివరకు చేయలేదు. ఈ చిత్రం కోసం మేం ఎంతో శ్రమిస్తున్నాం.. ఇదే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఒక చిత్రాన్ని షేర్ చేశారు. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 20 గంటల పాటు నీటి అడుగున ఈ హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
రవీంద్ర పుల్ల డైరెక్షన్ లో రాబోతున్న ‘మైసా’ చిత్రం ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. గిరిజన నేపథ్యంతో సాగే ఈ కథలో రష్మిక ఒక గోండు గిరిజన యువతిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం రష్మిక బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా స్టంట్ శిక్షణ కూడా పొందారు. కాగా, ఈ సినిమా టీజర్ అప్డేట్ను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాదు ఈ ఏడాదే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.

