Find Articles

సాగరహారానికి 14 ఏళ్లు.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసిన కేటీఆర్

సాగరహారానికి 14 ఏళ్లు.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసిన కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన ‘సాగరహారం’కు నేటితో 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ప్రత్యేకంగా స్పందించారు.

తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పిన పోరాట రూపమే సాగరహారమని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు విధించిన ఆంక్షలు, నిర్బంధాలు, ముళ్లకంచెలు, లాఠీఛార్జీలు, రబ్బర్ బుల్లెట్లను సైతం లెక్కచేయకుండా తెలంగాణ ప్రజలు తమ సంకల్పాన్ని చాటిచెప్పారని ఆయన గుర్తు చేశారు.

2012 సెప్టెంబర్ 30న హుస్సేన్‌సాగర్ తీరాన జరిగిన సాగరహారం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. ఉద్యమకారులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన చారిత్రక ఘట్టంగా దీనిని అభివర్ణించారు.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై నిర్వహించిన సాగరహారం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి 14 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ManaTV Team