అమెరికాలోని బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) ఆధ్వర్యంలో నవంబర్ 1న దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ రామన్‌లో ఉన్న విండెమియర్ రాంచ్ మిడిల్ స్కూల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ టాలీవుడ్ గాయని సమీరా భరద్వాజ్, తన బృందంతో కలిసి సంగీత విభావరి నిర్వహించనున్నారు. చిన్నారులు, యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలుగు ఐడల్ పోటీలు, యువతరాజువ్వలు, సిసింద్రీ తరాలు, ధ్రువ తరాల ప్రదర్శనలతో పాటు బాటా బీట్స్ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
దీపావళి వేడుకల్లో భాగంగా ప్రత్యేక షాపింగ్ కోసం దీపావళి బజార్, పండుగ వంటకాలతో రుచుల పందిరిని కూడా ఏర్పాటు చేయనున్నారు. సందర్శకుల కోసం ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించారు.
ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల వివరాల కోసం www.bata.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. బూత్‌లు, స్పాన్సర్షిప్ వివరాల కోసం 408-499-6530 నంబర్‌ను సంప్రదించవచ్చు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, నృత్యాలతో దీపావళి పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకునేలా బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఈ వేడుకలను నిర్వహిస్తోంది.