Find Articles

మాట నిలబెట్టుకున్న అఖిల్.. అభిమానిని కలిసిన హీరో

మాట నిలబెట్టుకున్న అఖిల్.. అభిమానిని కలిసిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అనే నినాదంతో సుపరిచితుడైన గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజును వ్యక్తిగతంగా కలుసుకున్నారు. అంతేకాదు గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా సమయంలో నాగరాజు థియేటర్ల వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు. అఖిల్ కటౌట్‌కు పాలాభిషేకం చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, పూజలు నిర్వహించడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ వీడియోలు అఖిల్ వద్దకు చేరడంతో ఆయన స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అవకాశం దొరికినప్పుడు నాగరాజును తప్పకుండా కలుస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడిన అఖిల్ తన అభిమాని నాగరాజును ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన అభిమాన హీరోను చూడగానే నాగరాజు వెంటనే కాళ్లపై పడబోగా.. అఖిల్ అతన్ని వారించి ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో నాగరాజు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఎమోషనల్ మీటింగ్‌కు సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. దీంతో ఈ వీడియోలో నెట్టింట క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

ManaTV Team