
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం
• కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యం
• జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం
• క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం
• 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే కసరత్తు
• పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన జనసైనికులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు
• దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న జనసేనాని ఆలోచనకు కార్యరూపంగా ఈ కమిటీలు
జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పించే దిశగా పార్టీ అధ్యక్షులు PawanKalyan రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల సేవలు, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుల వారి పరిశీలనకు సమర్పించనున్నాయి.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారితో సమన్వయం చేస్తూ పనిచేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ రూపుదిద్దుకుంది. ప్రతి కమిటీకి పరిశీలకులుగా సీనియర్ నాయకులను నియమించారు. అలాగే ఈ కమిటీలలో వీరమహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించడం జరిగింది.. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ కమిటీల కూర్పును స్వయంగా సమీక్షించి ఆమోదించారు. కమిటీలు సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని స్వయంగా తీసుకోనున్నారు.

