Find Articles

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్న అల్లు అర్జున్!

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్న అల్లు అర్జున్!

హైదరాబాద్‌ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకానున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2: ది రూల్’ స్పెషల్ ప్రీమియర్ షో సందర్భంగా..ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్ 4న అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిన చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. థియేటర్ యాజమాన్యం, అక్కడి సిబ్బందిని ఏ1 నుంచి ఏ10 నిందితులుగా పేర్కొన్నారు. అలాగే హీరో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చారు.

గతంలో ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.ఈ నేపథ్యంలోనే కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ లీగల్ టీమ్ అభ్యర్థనను నాంపల్లి కోర్టు పక్కనబెట్టేసిందని సమాచారం.ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఆయన కోర్టుకు స్వయంగా హాజరవుతారా.? లేక ఈ ఛార్జ్ షీట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా.? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అల్లు అర్జున్ న్యాయస్థానం ఎదుట హాజరైతే ఈ హైప్రొఫైల్ కేసు విచారణ తదుపరి దశకు చేరుకునే అవకాశం ఉంది.

ManaTV Team