
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు ( వర్కింగ్ టైటిల్ ‘NBK 112’) ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అమరావతి వేదికగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాను సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అమరావతిలోనే ఈ సినిమాను ప్రారంభించడం వెనుక కూడా ఓ ప్రత్యేకమైన కారణం ఉందని వివరించారు.
రాజధాని అమరావతిలో ఒక భారీ సినిమా ప్రారంభోత్సవం చేయాలనేది బాలకృష్ణ చిరకాల స్వప్నమన్న నిర్మాత సుధాకర్ చెరుకూరి అది తమ సినిమాతో నెరవేరడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన తాను, రాజధాని నడిబొడ్డున ఈ సినిమాను లాంచ్ చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. గత మూడు నాలుగేళ్లుగా బాలయ్యతో సినిమా చేయాలన్న తన కోరిక ఇప్పటికి నెరవేరింది” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

