Find Articles

విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ ‘ట్రైన్’ .. ఆగస్టులో రిలీజ్

విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ ‘ట్రైన్’ ..  ఆగస్టులో రిలీజ్

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’. ఈ చిత్రాన్ని ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను అధికారికంగా ప్రకటించారు. చెన్నైలో ఇటీవల జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఈ వివరాలను తెలిపారు.

ఈ సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత తెలిపారు. అయితే దీనిపై దర్శకుడు మిస్కిన్ సరదాగా జోక్యం చేసుకుంటూ కచ్చితమైన తేదీని ప్రకటించాలని కోరారు. ఆగస్టు 14న మరో సినిమా ఉందంటూ ఆయన చెప్పడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఈ చిత్రానికి కథ అందించిన మిస్కిన్ స్వయంగా సంగీతాన్ని కూడా సమకూర్చడం విశేషం. ఈ కథను ప్రత్యేకంగా విజయ్ సేతుపతి కోసమే సిద్ధం చేశానని, ఆయన తరహా నటనను కమల్ హాసన్, అమీర్ ఖాన్ వంటి దిగ్గజ నటులు సైతం ప్రదర్శించలేరని మిస్కిన్ తెలిపారు.కాగా ఆగస్టులో చిత్ర విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇటీవల విడుదలైన టీజర్, చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది. వేగంగా దూసుకెళ్తున్న ‘బ్లూ మౌంటెన్ ఎక్స్‌ప్రెస్’ రైలును కొంతమంది సాయుధులు తమ అధీనంలోకి తీసుకోవడం, ఆపదలో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు విజయ్ సేతుపతి చేసే వీరోచిత పోరాటం వంటి ఉత్కంఠభరిత సన్నివేశాలతో టీజర్‌ను ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.ఇక ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నాజర్, యుగి సేతు, నరైన్, కేఎస్ రవికుమార్, సంపత్ రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

ManaTV Team