Find Articles

అమెరికాలో ఆధ్యాత్మిక వైభవం: శ్రీ విద్యా టెంపుల్ సొసైటీలో ఘనంగా వార్షిక అలంకార ఉత్సవాలు!

అమెరికాలో ఆధ్యాత్మిక వైభవం: శ్రీ విద్యా టెంపుల్ సొసైటీలో ఘనంగా వార్షిక అలంకార ఉత్సవాలు!

అమెరికా నడిబొడ్డున… ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది! న్యూయార్క్ రాష్ట్రం, రష్ నగరంలో వెలసిన పవిత్ర ‘శ్రీ విద్యా టెంపుల్ సొసైటీ’లో వార్షిక అలంకార ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. జూలై 3 నుండి 6 వరకు నాలుగు రోజుల పాటు భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకల విశేషాలు ఇప్పుడు చూద్దాం!

ఉత్సవాల మొదటి రోజు… సర్వ విఘ్నాలను తొలగించి, సకల శుభకార్యాలకు ఆద్యుడైన శ్రీ మహా గణపతి స్వామివారి దివ్యారాధనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్చారణల మధ్య కలశ పూజ, పవిత్ర హోమం, మహా అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.

రెండవ రోజు… జగజ్జనని, శ్రీచక్రనిలయ అయిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దివ్యారాధనకు అంకితమైన అత్యంత విశిష్టమైన రోజు. పరాశక్తి అనుగ్రహాన్ని ప్రసాదించే పవిత్ర చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణాలు భక్తుల హృదయాలను భక్తిభావంతో నింపాయి. ఈ రోజు ప్రధాన ఆకర్షణ… సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారి ‘వెండి ఆభరణాల అలంకారం’. వెండి కిరీటం, వెండి కవచాలతో రాజరాజేశ్వరి దేవి, శివలింగం, మహా గణపతి దివ్యంగా దర్శనమిచ్చారు.

మూడవ రోజు… బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధనతో సాగింది. గురు తత్వాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే దత్తస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇక ఈ రోజు సాయంత్రం చిన్నారుల కోసం నిర్వహించిన ‘బాలల రథోత్సవం’ ఈ మహోత్సవానికి సరికొత్త శోభను, ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చింది.

నాలుగవ రోజు… క్షేత్రపాలకుడు, భక్త రక్షకుడైన శ్రీ భైరవ స్వామివారి ప్రత్యేక ఆరాధనతో మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆలయ రక్షణకు, లోకక్షేమానికి, భక్తుల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులందరూ భైరవ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఈ నాలుగు రోజుల ఉత్సవాలకు మంగళం పలికారు.వేద మంత్రాలు, దివ్య హోమాలు, అపూర్వ అలంకారాలు, దేవతల శోభాయాత్రలతో సాగిన శ్రీ విద్యా టెంపుల్ సొసైటీ వార్షిక అలంకార ఉత్సవాలు భక్తులకు మరువలేని ఆధ్యాత్మిక అనుభూతిని పంచాయి.

 

ManaTV Team