ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుతున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16 నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 10 శాతం నీటి సరఫరాను తగ్గించాలని నిర్ణయించింది.
2027 ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉండే నీటి నిల్వలను ఆధారంగా చేసుకుని డ్యామ్‌ల వారీగా నీటి వినియోగ ప్రణాళికను రూపొందించినట్లు మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తెలిపారు.
నీటి కొరత నేపథ్యంలో ముందుగా తాగునీరు, పశువుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి అవసరాలు తీర్చిన తర్వాతే సాగునీటికి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.
మహారాష్ట్రతో పాటు గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ నీటి కొరత పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. దీంతో రానున్న రోజుల్లో నీటి వినియోగంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.