లండన్: యూకేలోని హౌన్స్లోలో గోల్డెన్ స్కై ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు 2026 ఘనంగా జరిగాయి. అక్టోబర్ 10న హెస్టన్ కమ్యూనిటీ స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు 450 మందికి పైగా హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
పూజారి ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో దుర్గాపూజ, వేద మంత్రోచ్ఛారణలు, ఆశీర్వచనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. మహిళలు అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకురావడంతో ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. యాంకర్ శ్రీవల్లి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలు, దాండియా నృత్యాలు, షాపింగ్ స్టాళ్లు, రాఫెల్ బహుమతులు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫెల్తమ్ అండ్ హెస్టన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ, ఇలాంటి సాంస్కృతిక వేడుకలు భావితరాలకు మన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి గొప్పతనాన్ని పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన మూలాలతో అనుబంధాన్ని కొనసాగించేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని పేర్కొన్నారు. వేడుకలను నిర్వహించిన గోల్డెన్ స్కై ఈవెంట్స్ బృందాన్ని అభినందించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ నృత్యాల్లో పాల్గొన్నారు.
గోల్డెన్ స్కై ఈవెంట్స్ నిర్వాహకురాలు స్వర్ణలత చందా, మహేశ్వర్ చందా, సాయి అనన్య చందా సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బతుకమ్మలు, ఆకర్షణీయమైన వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.
అత్యంత అందమైన బతుకమ్మలకు బహుమతులు, రిజిస్ట్రేషన్ లక్కీ డిప్, రాఫెల్ డ్రా ద్వారా ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు. సంగీతం, నృత్యాలు, షాపింగ్ స్టాళ్లతో వేడుకలు ఆద్యంతం సందడిగా సాగాయి.
విదేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు ప్రవాస తెలుగు ప్రజల్లో ఐక్యత, సాంస్కృతిక అనుబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వేడుకలు ఘనవిజయాన్ని సాధించాయి.