Find Articles

న్యూజెర్సీలో అంబాసిడర్ బినయ్ శ్రీకాంత ప్రధాన్‌కు ఘన వీడ్కోలు సత్కారం

న్యూజెర్సీలో అంబాసిడర్ బినయ్ శ్రీకాంత ప్రధాన్‌కు ఘన వీడ్కోలు సత్కారం

డరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో భారత కాన్సుల్ జనరల్‌గా సేవలందించి, పదవీకాలం ముగించుకుంటున్న అంబాసిడర్ బినయ్ శ్రీకాంత ప్రధాన్‌కు ఘనంగా వీడ్కోలు సత్కారం నిర్వహించారు. 2026 నవంబర్ 22న న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉన్న మార్వెల్ బాల్‌రూమ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

నవంబర్ చివరి నాటికి తన పదవీకాలాన్ని పూర్తి చేసుకుని, తదుపరి బాధ్యతలు చేపట్టేందుకు న్యూఢిల్లీకి తిరిగి వెళ్లనున్న ప్రధాన్‌ను కమ్యూనిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎడిసన్ మేయర్ సామ్ జోషి మాట్లాడుతూ.. భారతీయ కమ్యూనిటీని ఏకం చేయడంలో అంబాసిడర్ బినయ్ ప్రధాన్ చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. వ్యక్తిగతంగా కమ్యూనిటీ సభ్యులతో మమేకమై, అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

FIA ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల ప్రాంతానికి చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, 14 సామాజిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధాన్ తన సతీమణి మునీసా ప్రధాన్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వివిధ సామాజిక కార్యక్రమాలు, పండుగలు, టౌన్‌హాల్ సమావేశాల్లో ప్రధాన్ అందించిన సేవలను FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి, ఛైర్మన్ అంకుర్ వైద్య ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. 2024 జనవరిలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనకు సహకరించిన వాలంటీర్లు, సామాజిక సంస్థలకు ప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు. న్యూయార్క్‌కు వచ్చిన తర్వాత తాను తొలిసారిగా కలిసిన ప్రతినిధి బృందం FIAదేనని ఆయన గుర్తుచేసుకున్నారు.

కాన్సులేట్ బృందం తరఫున మాట్లాడిన డిప్యూటీ కాన్సుల్ జనరల్ విశాల్ హర్ష్.. ప్రధాన్‌ను సీనియర్ సహోద్యోగిగా, మార్గదర్శకుడిగా అభివర్ణించారు.

ఈ వేడుకలో ఒడిశా సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్‌-అమెరికా సంబంధాల బలోపేతానికి ప్రధాన్ చేసిన కృషిని కొనియాడుతూ పలువురు ప్రసంగించారు. ఆయన సేవలకు గుర్తుగా ఫ్రేమ్ చేసిన స్కెచ్, జ్ఞాపిక ఫలకాన్ని అందజేయడంతో పాటు ప్రత్యేక ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

భారతీయ కమ్యూనిటీతో అనుబంధాన్ని పెంపొందిస్తూ, సామాజిక ఐక్యతకు కృషి చేసిన అంబాసిడర్ బినయ్ శ్రీకాంత ప్రధాన్‌కు ఈ వీడ్కోలు కార్యక్రమం ఘనమైన గౌరవాన్ని అందించింది.

ManaTV Team