Find Articles

న్యూయార్క్‌లో ‘హర హర మహాదేవ’.. స్వర వీణాపాణి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత విభావరి

న్యూయార్క్‌లో ‘హర హర మహాదేవ’.. స్వర వీణాపాణి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత విభావరి

అమెరికాలోని న్యూయార్క్‌లో ఆధ్యాత్మికత, సాహిత్యం, సంగీతాల సమ్మేళనంగా ‘హర హర మహాదేవ – శివ తత్వాలు’ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 14, 2026న శనివారం ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరగనుంది.

న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (NYTTA), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA), తెలుగు లలిత కళా సమితి (TLCA), SPB మ్యూజిక్ అకాడమీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. SPB మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ సంగీత విభావరి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ గీత రచయిత, గాయకుడు, సినీ సంగీత దర్శకుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, 72 మేళకర్త రాగాలపై విశేష పట్టు కలిగిన శ్రీ స్వర వీణాపాణి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

‘హర హర మహాదేవ – శివ తత్వాలు’ పేరుతో శివుని ఆధ్యాత్మిక వైభవాన్ని, శివతత్వంలోని అంతరార్థాన్ని సాహిత్యం, సంగీతం ద్వారా ప్రేక్షకులకు అందించనున్నారు. SPB మ్యూజిక్ అకాడమీ కళాకారులు పాటలను ఆలపించనున్నారు.

నవంబర్ 14న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. న్యూయార్క్‌లోని హిక్స్‌విల్లేలో ఉన్న అసామాయి హిందూ టెంపుల్ అండ్ సాయి దర్బార్ ఈ వేడుకకు వేదిక కానుంది. కార్యక్రమానికి హాజరయ్యే వారికి డిన్నర్ సదుపాయం కూడా కల్పించనున్నారు.

సంగీతాభిమానులు, సాహిత్య ప్రియులు, శివభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక సంగీతానుభూతిని ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ManaTV Team