Find Articles

లండన్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. ఒక్కచోట చేరిన పలు దేశాల ప్రజలు

లండన్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. ఒక్కచోట చేరిన పలు దేశాల ప్రజలు

వెలుగుల పండుగ దీపావళి వేడుకలు లండన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటిష్, ఆఫ్రికన్, భారతీయ, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన ప్రజలతో పాటు ఉత్తర, దక్షిణ భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాల సంస్కృతులను ప్రతిబింబించే కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ ప్యారడైజ్ పాయింట్ స్పాన్సర్ చేసిన రుచికరమైన వంటకాలు వేడుకల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక విందుగా నిలిచాయి.

ది మెంటర్ రింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

ది మెంటర్ రింగ్ సీఈఓ సుజాత తలాడి, రోజీ బేడీ నేతృత్వంలో ఈ ప్రత్యేక దీపావళి వేడుకలను నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పడంతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రజల మధ్య స్నేహభావం, ఐక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిలిచింది.

ప్రముఖుల హాజరు.. ప్రత్యేక ఆకర్షణ

ఈ వేడుకలకు లండన్ బరో ఆఫ్ బెక్స్లీ ప్రతినిధి డిప్యూటీ లెఫ్టినెంట్ మిస్టర్ డేవిడ్ ఈస్టన్, లండన్ డిప్యూటీ మేయర్ ఫర్ కమ్యూనిటీస్ అండ్ సోషల్ జస్టిస్ డాక్టర్ డెబ్బీ వీక్స్-బెర్నార్డ్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. వారి హాజరుతో కార్యక్రమానికి మరింత ప్రత్యేకత చేకూరింది.

దేశాలు వేరైనా, భాషలు వేరైనా పండుగ సంబరాల్లో అందరూ ఒక్కటేనని ఈ వేడుకలు చాటిచెప్పాయి. భారతీయ సంప్రదాయాల గొప్పతనాన్ని, సాంస్కృతిక వైవిధ్యంలోని ఐక్యతను ప్రతిబింబించిన లండన్ దీపావళి సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ManaTV Team