Find Articles

రూ.500, రూ.1000, రూ.2000 నోట్లు రద్దు చేయాలా? చంద్రబాబు కీలక డిమాండ్.. దేశవ్యాప్తంగా చర్చ

రూ.500, రూ.1000, రూ.2000 నోట్లు రద్దు చేయాలా? చంద్రబాబు కీలక డిమాండ్.. దేశవ్యాప్తంగా చర్చ

అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి డిమాండ్ చేశారు. రూ.500, రూ.1000, రూ.2000 నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో రూ.100, రూ.200 నోట్లను మాత్రమే చలామణిలో ఉంచాలని ఆయన సూచించారు.

డిజిటల్ కరెన్సీ, ఆన్‌లైన్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడం ద్వారా అవినీతిని నియంత్రించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గతంలోనే ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి డిజిటల్ కరెన్సీ నివేదికలో తన సూచనలు అందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదనను మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లు ప్రవేశపెట్టారు. అయితే 2023లో ఆర్బీఐ రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది.

మరోవైపు, డిజిటల్ చెల్లింపుల సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ సమానంగా అందుబాటులో లేవని, నగదు లావాదేవీలపై ఆధారపడే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో మరోసారి పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ప్రస్తుతం చంద్రబాబు చేసిన ప్రతిపాదన మాత్రమే.

ManaTV Team