మలేషియా వెళ్లాలనుకునే భారతీయులకు కీలక అప్డేట్. భారతీయులకు ప్రస్తుతం కల్పిస్తున్న వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని డిసెంబర్ 31, 2026తో రద్దు చేయనున్నట్లు మలేషియా ఇమిగ్రేషన్ శాఖ ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి మలేషియా వెళ్లాలంటే భారతీయులు తప్పనిసరిగా వీసా పొందాల్సి ఉంటుంది.
డిసెంబర్ 1, 2026 నుంచి ‘మై వీసా’ (MyVisa) పోర్టల్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటివరకు పర్యాటక ప్రయోజనాల కోసం వీసా లేకుండానే మలేషియాలోకి ప్రవేశించేందుకు భారతీయులకు అనుమతి ఉండేది.
అయితే, టూరిస్ట్ వీసా నిబంధనలను కొందరు దుర్వినియోగం చేస్తూ అక్రమంగా ఉద్యోగాల కోసం మలేషియాకు వెళ్తున్నారని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని భారత హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని రద్దు చేస్తూ మలేషియా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త నిబంధనలతో మలేషియా పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులు ముందుగానే వీసా ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.