పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తనకు, తన భార్య బుష్రా బీబీకి సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆరోపిస్తూ పాకిస్థాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు.
తన కుడి కంటి చూపు 85 శాతం మేర తగ్గిపోయిందని ఇమ్రాన్ ఖాన్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన భార్య బుష్రా బీబీకి కూడా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.
జైల్లో రోజుకు 22 గంటల పాటు ఒంటరిగా ఉంచుతున్నారని, తన పరిస్థితి ఇలాగే కొనసాగితే జైలులోనే మరణించే పరిస్థితి రావచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు, తన భార్యకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఇమ్రాన్ ఖాన్ కోరారు. ఈ లేఖతో పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది.