న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లో ఉన్న సాయి దత్త పీఠం శివ విష్ణు ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసంలో 365 వత్తులతో దీపాలను వెలిగించడం సంవత్సరంలోని ప్రతి రోజుకూ భగవంతునికి దీపారాధన సమర్పించినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా భక్తులు 365 వత్తులను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నెల రోజుల పాటు ఆలయంలో పంచముఖ పరమశివునికి ప్రతిరోజూ రుద్రాభిషేకం, శివ స్తోత్రాలు, భజనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రతి సోమవారం ప్రత్యేక లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం, మంగళవారం ఆంజనేయస్వామికి, శుక్రవారం అమ్మవారికి, శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామికి, ఆదివారం గణపతికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలు విజయవంతం కావడానికి సహకరించిన భక్తులు, దాతలు, వాలంటీర్లందరికీ SDPSVT ఫౌండర్ అండ్ చైర్మన్ రఘు శర్మ సంకరమంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ కార్తీక పౌర్ణమి వేడుకలు న్యూజెర్సీ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి.