పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల విరామం తర్వాత శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం బీజేపీ, అకాలీదళ్ నేతలు ఇకపై కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో సెప్టెంబర్ 26, 2020న శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. తాజాగా బాదల్ నాయకత్వంలో ఆ పార్టీ తిరిగి ఎన్డీఏలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బీజేపీ, అకాలీదళ్ కలయిక హిందూ-సిఖ్ సహృద్భావానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహాలపై ఇరు పార్టీల నేతలు దృష్టి సారిస్తున్నారు.
ఆరేళ్ల తర్వాత పాత మిత్రపక్షాలు మళ్లీ చేతులు కలపడంతో పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది.