Find Articles

ATA మహాసభల్లో సంగీత సంబరం.. ఎం.ఎం. కీరవాణి లైవ్ కాన్సర్ట్‌తో ప్రత్యేక ఆకర్షణ!

ATA మహాసభల్లో సంగీత సంబరం.. ఎం.ఎం. కీరవాణి లైవ్ కాన్సర్ట్‌తో ప్రత్యేక ఆకర్షణ!

అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు జరగనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురానున్న ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈసారి మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి లైవ్ కాన్సర్ట్ ప్రేక్షకులను అలరించనుంది. ఆయన సంగీత బృందంతో కలిసి అందించే ఈ ప్రత్యేక సంగీత విభావరి తెలుగు సంగీతాభిమానులకు మరపురాని అనుభూతిని అందించనుందని నిర్వాహకులు తెలిపారు.

అదే వేదికపై ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్లు త్రిఒరి (Threeory), ఆరెంజ్ స్ట్రీట్ (Orange Street) కూడా తమ ప్రత్యేక ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. ఆధునిక సంగీతం, లైవ్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్, వినూత్న సంగీత సమ్మేళనాలతో ఈ కార్యక్రమం యువతను విశేషంగా ఆకట్టుకునేలా రూపకల్పన చేశారు.

సంగీతం, వినోదం, తెలుగు సంస్కృతి, కుటుంబ సమేతంగా ఆస్వాదించే అనేక కార్యక్రమాలతో ATA 2026 మహాసభలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులు ఈ మహాసభల్లో పాల్గొని ఈ సంగీత వేడుకను ఆస్వాదించాలని వారు ఆహ్వానించారు.

ManaTV Team