Categories: NRI Updates

ఆటా 19వ మహాసభలు: బాల్టిమోర్‌లో తెలుగు సంస్కృతి వైభవానికి సర్వం సిద్ధం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 19వ మహాసభలు మరియు యూత్ కన్వెన్షన్‌కు బాల్టిమోర్ నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. అమెరికా నలుమూలల నుంచి వేలాది మంది ప్రవాస తెలుగు ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు, భారతదేశం నుంచి రాజకీయ, సినీ, సాహిత్య, వ్యాపార రంగాలకు చెందిన విశిష్ట అతిథులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా తెలిపారు.

దాదాపు 70 కమిటీలు గత కొన్ని నెలలుగా సమన్వయంతో పనిచేస్తుండగా, వందలాది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా శ్రమిస్తూ మహాసభలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. తెలుగు సంస్కృతి, కళలు, సాహిత్యంతో పాటు విద్య, వైద్యం, అలుమ్ని, బిజినెస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆటా ప్రతినిధులు స్వయంగా కలిసి మహాసభలకు ఆహ్వానించినట్లు తెలిపారు. తమ తరఫున ప్రతినిధులను పంపిస్తామని పలువురు నాయకులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

యువత కోసం ప్రత్యేక ఆకర్షణలు

ఈసారి యూత్ కన్వెన్షన్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. జూలై 31న బాల్టిమోర్ హార్బర్‌లో భారీ క్రూజ్ పార్టీని నిర్వహించనున్నారు. 16 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. నాలుగు గంటల పాటు కొనసాగే ఈ క్రూజ్‌లో డీజే సంగీతం, డ్యాన్స్, వినోద కార్యక్రమాలు, ప్రత్యేక భారతీయ వంటకాలతో యువతకు మరపురాని అనుభూతిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 250 మందికి పైగా యువత హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ సినీ తారలు, క్రీడాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.

శనివారం ఉదయం వైద్యులు, న్యాయవాదులు, క్రీడా నిపుణులు, అమెరికాలో విజయవంతమైన తెలుగు యువ ప్రతినిధులతో కెరీర్ గైడెన్స్, నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నారు. అనంతరం యువత కోసం బ్యాంక్వెట్ డిన్నర్, సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక వేడుకలు

మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌తో పాటు యువతను ఆకట్టుకునే ‘నిరవల్’ లైవ్ మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సంగీత విభావరి, సాహిత్య సభలు, నృత్య ప్రదర్శనలు, జానపద కళారూపాలు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో మూడు రోజుల పాటు సందడి నెలకొననుంది.

దేశవ్యాప్తంగా పోటీలు – ఫైనల్స్ మహాసభల్లో

మహాసభలకు ముందు అమెరికాలోని వర్జీనియా, చికాగో, డెలావేర్ వ్యాలీ, న్యూజెర్సీ, ఆర్లాండో, ఆస్టిన్, ఫీనిక్స్, అట్లాంటా, డల్లాస్, రాలీ తదితర నగరాల్లో “ఝుమ్మంది నాదం” గాన పోటీలు, “సయ్యంది పాదం” నృత్య పోటీలు, అందాల పోటీలు నిర్వహించారు. ప్రతి నగరంలో 150 నుంచి 200 మంది వరకు పాల్గొనగా, విజేతలకు బాల్టిమోర్ మహాసభల్లో ఫైనల్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నారు.

యువ ప్రతిభకు కొత్త వేదిక

యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు షార్ట్ ఫిల్మ్, రీల్స్, ఫోటోగ్రఫీ విభాగాల్లో ప్రత్యేక పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు టాలీవుడ్ ప్రముఖ సినీ ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. యువత తమ ప్రతిభను ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు.

తెలుగు సంస్కృతి పరిరక్షణే లక్ష్యం

విదేశాల్లో జన్మించి పెరుగుతున్న రెండో, మూడో తరం తెలుగు యువతకు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడం ఈ మహాసభల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. తెలుగు భాష, సాహిత్యం, సంగీతం, కళల వైభవాన్ని పరిచయం చేస్తూ యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందించేలా కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు.

సినీ ప్రముఖుల సందడి

ఈ మహాసభల్లో ప్రముఖ సినీ తారలు, సంగీత దర్శకులు, గాయకులు పాల్గొననున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే, రీతూ వర్మ, శ్రీముఖి, అనన్య నాగళ్ల, దివి, నిర్మాత దిల్ రాజు, నటులు అడివి శేష్, నితిన్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలు, యువత ప్రతిభ, వ్యాపార అవకాశాలు, సామాజిక సేవలను ఒకే వేదికపై ఆవిష్కరించే ఆటా 19వ మహాసభలు ప్రవాస తెలుగు సమాజానికి చిరస్మరణీయ వేడుకగా నిలుస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

Jo Sharma won Best Debut Heroine Award for M4M by APFCC Film Chambers

American Actress Jo Sharma got BEST DEBUT HEROINE AWARD for M4M Movie & Mohan Vadlapatla…

29 minutes ago

7 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానానికి పిడుగు.. సేఫ్‌గా ల్యాండింగ్

పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…

4 hours ago

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి భారీ దాడులు

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…

4 hours ago

ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం

ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…

4 hours ago

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…

11 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

12 hours ago