
YAGGH – TAGDV ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కోసం 5కే హెల్త్ రన్
ఎక్స్టన్ (పెన్సిల్వేనియా): క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించేందుకు యంగ్ అంబాసిడర్స్ ఆఫ్ గ్లోబల్ గ్రేస్ హెల్త్ (YAGGH), తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ (TAGDV Youth) సంయుక్తంగా నిర్వహించిన 5కే హెల్త్ రన్ ఉత్సాహంగా జరిగింది. పెన్సిల్వేనియాలోని ఎక్స్టన్ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పాల్గొని క్యాన్సర్ అవగాహన, నివారణ ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి ప్రాముఖ్యతకు తమ మద్దతు తెలిపారు. కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులను భారతదేశంలోని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న గ్లోబల్ గ్రేస్ హెల్త్ సంస్థకు విరాళంగా అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత సిద్ధపురెడ్డి క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మీడియాతో YAGGH వ్యవస్థాపక అధ్యక్షుడు, TAGDV Youth చైర్మన్ అద్వైత్ బొందుగుల మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన వ్యక్తులు, కుటుంబాలు, సమాజ నిర్మాణానికి ఆరోగ్య అవగాహన అత్యంత కీలకం. క్యాన్సర్ అవగాహన, నివారణ ఆరోగ్య విద్యపై ఈ ఏడాది ప్రత్యేక దృష్టి సారించాం. గ్లోబల్ గ్రేస్ హెల్త్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంచుతున్నాం” అని తెలిపారు. TAGDV అధ్యక్షుడు హరీష్ , గ్లోబల్ గ్రేస్ హెల్త్ బోర్డ్ డైరెక్టర్ సురేష్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లకు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో TAGDV Youth సహ-అధ్యక్షులు శ్రీయ గొర్రెపాటి, లిఖిత ఇనంపూడి, తనిష్క కర్రోతు, ద్రుతి బుడాటి, అనీష్ గరిమెళ్ల పాల్గొన్నారు.

