Find Articles

ఆటా 19వ మహాసభల్లో తెలుగు సంస్కృతికి పెద్దపీట… ‘అల్లూరి ’ బుర్రకథ

ఆటా 19వ మహాసభల్లో తెలుగు సంస్కృతికి పెద్దపీట… ‘అల్లూరి ’ బుర్రకథ

అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో బాల్టిమోర్‌లో నిర్వహించనున్న 19వ మహాసభల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలకు విశేష ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు మహాసభల మీడియా చైర్ భాను స్వర్గం తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు, మరుగునపడుతున్న జానపద కళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగు జానపద కళారూపమైన బుర్రకథను మహాసభల్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన “బుర్రకథ బృందగానం” సాంస్కృతిక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

“తెలుగు వీరగ్రంథాల నాదం…” అనే ఇతివృత్తంతో సాగే ఈ ప్రదర్శన ద్వారా అల్లూరి పోరాట స్ఫూర్తి, దేశభక్తి, తెలుగు వీరుల గాథలను కళాత్మకంగా ఆవిష్కరించనున్నారు. సంప్రదాయ బుర్రకథ శైలిలో సంగీతం, నృత్యం, కథనం సమ్మిళితంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ ప్రత్యేక బుర్రకథను పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శ్రీదేవి యాదపల్లి, శ్రీ నందకిషోర్ యాదపల్లి, శ్రీ విజయ్ కుమార్ యాదపల్లి బృందం ప్రదర్శించనుంది. ప్రవాస భారతీయులకు తెలుగు సంస్కృతిని చేరువ చేయడంతో పాటు యువతలో సంప్రదాయ కళల పట్ల ఆసక్తి పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

సాంస్కృతిక వైభవం, సంప్రదాయ కళారూపాలు, ఆధునిక కార్యక్రమాల సమ్మేళనంగా ఆటా 19వ మహాసభలు తెలుగు వారందరికీ చిరస్మరణీయ అనుభూతిని అందించనున్నాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ManaTV Team