
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటనలోని వన్డే సిరీస్ కోసం టీమ్ ను ఎంపిక చేసే ముందు ఆయన విషయంలో సందిగ్ధత నెలకొంది. గాయం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ నివేదికల ఆధారంగానే సెలక్టర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 75 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, అదే మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురయ్యారు.. అప్పటి నుంచి లండన్‌లో ఉంటున్నారు. అయితే తాజాగా బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ఫిట్‌నెస్ అసెస్‌మెంట్‌కు హాజరు కానున్నారని సమాచారం. ఢిల్లీలోని యశోభూమిలో తన ‘వన్8’ బ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్ ముగిసిన తర్వాత కోహ్లీ ఏ క్షణంలోనైనా ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వచ్చే వారం టీమ్ ను ఎంపిక చేయనుంది. ఇటీవలే శ్రీలంకలో ఇండియా ‘ఏ’ జట్టు ఆడిన ట్రై సిరీస్‌ను పర్యవేక్షించిన అజిత్ అగార్కర్, ఇప్పుడు కోహ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. జూలై 14 నుంచి 19 వరకు బర్మింగ్‌హామ్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జరగనున్న సిరీస్‌కు విరాట్ కోహ్లీ ఎంపిక అనేది అతని ఫిట్‌నెస్ నివేదికలపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. దీంతో ఈ కోహ్లీ ఫిట్ నెస్ పై ఉత్కంఠ నెలకొంది.

