పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ గుంటూరులో వైసీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతం ఏపీలోనే ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పిన ‘సంపద సృష్టి’, ‘సుపరిపాలన’ అంటే ఇదేనా అంటూ నిలదీశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర పన్నులను తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేస్తామని హామీలు గుప్పించిన నారా లోకేష్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను నట్టేట ముంచారని అంబటి రాంబాబు విమర్శలు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వానికి కేవలం కమీషన్లు వచ్చే పనులపైనే శ్రద్ధ ఉందని, ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదని అంబటి రాంబాబు ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఇంధన ధరల భారంతో సామాన్యులు నలిగిపోతుంటే, మరోవైపు ఆర్టీసీ, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.