నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ జీవితంలో తప్పనిసరిగా కొనుగోలు చేసే పలు వస్తువుల ధరలు ఇప్పటికే 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
క్వాలిటీ బియ్యం ధర గతంలో కిలోకు రూ.45 నుంచి రూ.50 మధ్య ఉండగా.. ప్రస్తుతం రూ.70కి పైగా పలుకుతోంది. ఉల్లి ధర కూడా భారీగా పెరిగి కిలో రూ.20 నుంచి రూ.60 వరకు చేరింది.
అల్లం, వెల్లుల్లి ధరలు కిలోకు రూ.150కుపైగానే ఉన్నాయి. వంట నూనె ధరలు కూడా పెరిగాయి. గతంలో లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.160లోపే లభించగా.. ప్రస్తుతం రూ.180కిపైగా విక్రయిస్తున్నారు.
ఇక పంచదార ధర కిలోకు గతంలో సగటున రూ.40 ఉండగా.. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.70 వరకు చేరింది. కంది పప్పు, మినప పప్పు, పెసర పప్పు ధరలు కూడా గతంతో పోలిస్తే కిలోకు రూ.20కుపైగా పెరిగాయి.
దీంతో నెలవారీ ఇంటి ఖర్చులు పెరిగి.. ధరల పెరుగుదల సామాన్యుడి కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.