అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యూత్ కన్వెన్షన్ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగు ప్రవాసులు, ప్రముఖులు, యువత పాల్గొనడంతో వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా బాంక్వెట్ కమిటీ చైర్ మనోహర్ ఎనుగు మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహాసభలకు సంబంధించి పలు విశేషాలను పంచుకున్నారు. తొలి రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, గ్రాండ్ బ్యాంక్వెట్, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు. తమ సహచరులు, మిత్రులు అవార్డులు అందుకోవడం ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. మూడు రోజుల ఈ మహాసభలను ఒక వివాహ వేడుకతో పోలుస్తూ మనోహర్ ఎనుగు సరదాగా వ్యాఖ్యానించారు. తొలి రోజు సంగీత్ కార్యక్రమంలా, రెండో రోజు వివాహ వేడుకలా, చివరి రోజు రిసెప్షన్‌ను తలపించేలా కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు
రెండో రోజు నుంచి ప్రధాన సదస్సులు ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. యూత్ ఫోరమ్స్, బిజినెస్ ఫోరమ్స్, పొలిటికల్ ఫోరమ్స్‌తో పాటు పలు సామాజిక నెట్వర్కింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణకు శ్రీధర్‌తో పాటు మొత్తం నిర్వాహక బృందం వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో విశేష కృషి చేసిందని అభినందించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కార్యక్రమాలను ఆస్వాదిస్తూ చిరస్మరణీయ అనుభూతిని పొందాలని ఆకాంక్షిస్తూ మనోహర్ ఎనుగు తన ప్రసంగాన్ని ముగించారు.