
అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన సమయలో గుర్తు తెలియని దుండగులు కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ శ్రీనివాస్, నీలిమ దంపతుల కుమారుడు కుంచ అన్షుల్ గా గుర్తించారు.
2023లో అమెరికాకు వెళ్లిన అన్షుల్ కేడబ్ల్యూసీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. నార్త్ ఫిలడెల్ఫియాలో ఉంటున్న ఆయన అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేసేవారు.ఈ క్రమంలోనే ఎడ్ గ్లీ రేమండ్ రోజెస్ హోమ్స్ ప్రాంగణంలో నిర్మానుష్యంగా ఉండే ఇంటికి మూడు పిజ్జాల డెలివరీ ఆర్డర్ వచ్చింది. దీంతో రాత్రి 12.30 గంటల సమయంలో అన్షుల్ డెలివరీ కోసం ఆ ఇంటికి వెళ్లారు. వాహనం దిగి ఇంటి ప్రాంగణంలోకి వెళ్లిన కొద్దిసేపటికే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బుల్లెట్ గాయాలు కావడంతో తీవ్రంగా గాయపడిన అన్షుల్, ఘటనా స్థలంలోనే మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదని, ఘటనా స్థలంలో మూడు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అయితే పిజ్జా డెలివరీ పేరుతో పిలిపించి ఈ దారుణానికి పాల్పడ్డారని మృతుని సోదరి ఆరోపిస్తున్నారు. ఇది ట్రాప్ అని, ఉద్దేశ పూర్వకంగానే హత్య చేశారని వాపోయింది. అనంతరం తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ కు తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

