
‘బాహుబలి 3’ ఉండనుందా.? ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇదే చర్చ జోరందుకుంది. తాజాగా విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్యలతో పాటు, ఎక్స్ప్రెషన్స్ తో మూడో భాగం రానుందని అభిమానులు భావిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ డాక్యుమెంటరీలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘ప్రపంచం ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు.. కానీ బాహుబలి..’’ అని చెబుతుండగా, వెంటనే ప్రభాస్ మూడు వేళ్లు చూపిస్తూ చిరునవ్వు చిందించారు.. పక్కనే ఉన్న అనుష్క శెట్టి కూడా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికితోడు చివరిలో ‘అండ్ ది లెగసీ కంటిన్యూస్’ అనే సందేశం కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది. దీంతో ఫ్యాన్స్ ‘బాహుబలి 3 అధికారికంగా వస్తోంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి నుంచి గానీ, చిత్ర బృందం నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరోవైపు ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ నాలుగు భాగాల డాక్యుమెంటరీ జూన్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. బాహుబలి చిత్రాల నిర్మాణం, వాటి వెనుక కథలు, ప్రపంచవ్యాప్తంగా సాధించిన విజయాలను ఇందులో చూపించారు. 2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ భారతీయ సినీ చరిత్రలో సంచలన విజయాలు సాధించాయి.

