
టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఆర్కే బీచ్ సమీపంలోని గోకుల్ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ వేదికపై నుంచి సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత రాజ్ నిడిమోరు అధికారికంగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ, సినిమా విడుదలకు ముందు కొంత ఆందోళన చెందినట్లు చెప్పారు. కనీసం ఒక్క టికెట్ అయినా అమ్ముడుపోతుందా.? అనే భయంలో ఉన్నట్లు తెలిపారు. కానీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరించారని సంతోషం వ్యక్తం చేశారు. అనారోగ్యం తర్వాత తాను తిరిగి సినిమాల్లో నటించడానికి తన భర్త, నిర్మాత రాజ్ నిడిమోరు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. అయితే, సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై మా ఇంటి బంగారం సినిమా రూపొందింది. జూన్ 19న విడుదలైన ఈ యాక్షన్-డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది.

