Find Articles

వింబుల్డన్‌లో గిల్ సందడి.. సచిన్ దంపతులతో కలిసి రాయల్ బాక్స్‌లో టీమిండియా కెప్టెన్!

వింబుల్డన్‌లో గిల్ సందడి.. సచిన్ దంపతులతో కలిసి రాయల్ బాక్స్‌లో టీమిండియా కెప్టెన్!

భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లండన్‌లోని ప్రసిద్ధ సెంటర్‌ కోర్టులో ఉన్న రాయల్‌ బాక్స్‌ నుంచి మ్యాచ్‌ను వీక్షించడానికి గిల్‌కు ప్రత్యేక ఆహ్వానం దక్కింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ఆయన భార్య అంజలితో కలిసి గిల్‌ మ్యాచ్‌ను ఆస్వాదించారు.. వీరు ముగ్గురూ పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

ఈ ప్రత్యేక ఆహ్వానంతో వింబుల్డన్‌ రాయల్‌ బాక్స్‌లో అడుగుపెట్టిన నాలుగో భారత క్రికెట్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఈ గౌరవాన్ని సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మాత్రమే దక్కించుకున్నారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్‌ను వింబుల్డన్‌ నిర్వాహకులు ‘క్రికెట్‌ రాయల్టీ’గా అభివర్ణించడం ఇక్కడ విశేషం. కాగా, ఇదే రాయల్‌ బాక్స్‌లో వెస్టిండీస్‌ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్‌ లారా కూడా ప్రత్యేక అతిథిగా మెరిశారు.

శుభ్‌మన్‌ గిల్‌ ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో విస్తృతంగా పాల్గొంటున్నారు. వింబుల్డన్‌కు ముందు బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ సందర్భంగా సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌లో జరిగిన ఫార్ములా-1 రేసులోనూ అతడు సందడి చేశాడు. అక్కడ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన గిల్, ప్యాడక్‌ను సందర్శించి ఫార్ములా-1 ప్రముఖులతో ముచ్చటించారు. అయితే, గత కొన్నేళ్లుగా సచిన్‌ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్‌ రిలేషన్‌లో ఉన్నాడంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇరుపక్షాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఇప్పుడు వింబుల్డన్ మ్యాచ్‌లో సచిన్ పక్కనే గిల్ కూర్చోవడంతో నెటిజన్లు మరోసారి వీరి రిలేషన్ గురించిన పాత విషయాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ManaTV Team