Find Articles

19వ ఆటా మహాసభల్లో ‘వివాహ పరిచయ వేదిక’.. ఉచిత నమోదుకు అవకాశం!

19వ ఆటా మహాసభల్లో ‘వివాహ పరిచయ వేదిక’.. ఉచిత నమోదుకు అవకాశం!

అమెరికన్ తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రవాస తెలుగు కుటుంబాల కోసం ప్రత్యేకంగా ‘ఆటా వివాహ పరిచయ వేదిక’ (ATA Matrimony) కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అమెరికాలో స్థిరపడిన తెలుగు యువతీ యువకులకు తగిన జోడీని ఎంపిక చేసుకోవడానికి, వారి తల్లిదండ్రులు ఒకరినొకరు నేరుగా కలుసుకొని సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని ఆటా ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమం ఆగస్టు 1, 2 తేదీలలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లోని రూమ్ నెంబర్ 327లో మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగనుంది.

ఈ పరిచయ వేదికకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని, ఆసక్తి ఉన్నవారు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ వేదిక ద్వారా అనేక ప్రవాస తెలుగు కుటుంబాలకు సరైన సంబంధాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఆసక్తి గల వధూవరుల తల్లిదండ్రులు ముందస్తుగా ఆటా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు.

ManaTV Team