Find Articles

ఆటా యూత్ కన్వెన్షన్‌లో రవి చల్లా పిలుపు.. యువతే తెలుగు భవిష్యత్తుకు బలమైన పునాది

ఆటా యూత్ కన్వెన్షన్‌లో రవి చల్లా పిలుపు.. యువతే తెలుగు భవిష్యత్తుకు బలమైన పునాది

అమెరికాలోని బాల్టిమోర్‌లో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో భాగంగా నిర్వహించిన యూత్ కన్వెన్షన్‌లో ఆటా కోఆర్డినేటర్ రవి చల్లా యువతను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
మహాసభలకు హాజరైన అమెరికా, భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులు, స్పాన్సర్లు, దాతలు, భాగస్వామ్య సంస్థలు, కళాకారులు, మీడియా ప్రతినిధులందరికీ ఆటా తరఫున రవి చల్లా హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ మహాసభలు కేవలం ఒక బ్యాంక్వెట్ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఐక్యత, అనుబంధాలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మహోత్సవమని పేర్కొన్నారు.

ఈ స్థాయి మహాసభలను విజయవంతంగా నిర్వహించేందుకు వందలాది మంది వాలంటీర్లు నెలల తరబడి అంకితభావంతో శ్రమించారని ఆయన కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక, నైతిక సహకారం అందించిన స్పాన్సర్లు, దాతలు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మూడు రోజుల పాటు కొనసాగే ఈ మహాసభలు కేవలం సమావేశాలకు పరిమితం కావని, కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడానికి, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకురావడానికి, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడానికి ఉత్తమ అవకాశమని రవి చల్లా అన్నారు.

“ఆటా అనేది కేవలం ఒక సంస్థ కాదు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే కుటుంబంగా కలిపే సేవా వేదిక” అని ఆయన పేర్కొన్నారు. తెలుగు సమాజ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, యువత సాధికారత కోసం ఆటా నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. యువత సామాజిక సేవలో భాగస్వాములు కావడంతో పాటు తమ ప్రతిభ, నాయకత్వ సామర్థ్యాలను సమాజ అభివృద్ధికి వినియోగించాలని రవి చల్లా పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరినీ ఒకే కుటుంబంగా కలిపే వేదికగా ఆటా మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ManaTV Team