అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు సినీ, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా జరిగాయి.. ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటుడు అడివి శేష్, హీరోయిన్ పూజా హెగ్డే ప్రత్యేక అతిథులుగా హాజరై ప్రవాస తెలుగు ప్రేక్షకులను అలరించారు.
ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన అడివి శేష్, మహాసభల్లో పాల్గొన్న వారిలో కనిపించిన ఉత్సాహం తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారందరూ యువతలా ఉత్సాహంగా కనిపిస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించి సభలో నవ్వులు పూయించారు. అనంతరం “లేడీస్ ఫస్ట్” అంటూ మైక్‌ను పూజా హెగ్డేకు అందించారు.
పూజా హెగ్డే మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమ తనకు అపారమైన ప్రేమ, ఆదరణ అందించిందని అన్నారు. తెలుగు ప్రేక్షకుల అభిమానమే తన సినీ ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు తనను “బుట్టబొమ్మ” అని ప్రేమగా పిలుస్తుంటారని, అది తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తుందని చెప్పారు.
విదేశాల్లోనూ తెలుగు సంస్కృతి, తెలుగు సినిమాలకు లభిస్తున్న ఆదరణ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పూజా హెగ్డే పేర్కొన్నారు. ప్రవాస తెలుగువారు తమ భాష, సంస్కృతిని ఇంత గొప్పగా ముందుకు తీసుకెళ్తుండటం అభినందనీయమని ఇద్దరు సినీ ప్రముఖులు కొనియాడారు. కార్యక్రమం అనంతరం అభిమానులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు.