అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఆటా మహాసభలకు హైదరాబాద్ నుంచి హాజరైన బీజేపీ నాయకులతో పాటు స్థానిక బీజేపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు రాజు, కొంపల్లి శ్రీనివాస్, విజయ్, శ్రీకాంత్, శరద్, విలాస్, సంతోష్, వాసుదేవ్ తదితరులను ఆయన అభినందించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంలో, అలాగే ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఎన్. రామచందర్ రావు ప్రస్తావించారు.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ, భారతీయతను, తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు జాతి గర్వపడేలా ప్రవాసులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తదుపరి తరాలకు చేరవేయడంలో ఆటా వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, ప్రవాస భారతీయులు, ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు.