అమెరికాలోని బాల్టిమోర్‌లో నిర్వహించిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ మహాసభలకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఆటా నిర్వాహకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులను ఆహ్వానించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తాము ఈ కార్యక్రమానికి హాజరయ్యామని భట్టి తెలిపారు. విదేశాల్లో స్థిరపడినా తమ భాష, సంస్కృతి, మూలాలను మరువకుండా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఆటా మహాసభలు ప్రశంసనీయమని అన్నారు.
తెలంగాణను ప్రపంచ స్థాయి అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళనతో పాటు రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్), 36 రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధికి నాణ్యమైన విద్య కీలకమని పేర్కొన్న ఆయన, 100 నియోజకవర్గాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపడుతోందని వివరించారు.
అమెరికాలో ఉన్న ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలు స్థాపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భట్టి పిలుపునిచ్చారు.
పెట్టుబడిదారులకు సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, ఎన్నారైలకు చట్టపరమైన రక్షణ కల్పించే ప్రత్యేక వ్యవస్థను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే విదేశాల్లో ఉన్న అర్హులైన ఓటర్లు ఆన్లైన్ ద్వారా తమ ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని సూచిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.