Find Articles

ఆటా మహాసభల్లో అనన్య నాగళ్ల సందడి.. తెలుగు సంస్కృతిని కాపాడుతున్న నిర్వాహకులకు ప్రశంసలు

ఆటా మహాసభల్లో అనన్య నాగళ్ల సందడి.. తెలుగు సంస్కృతిని కాపాడుతున్న నిర్వాహకులకు ప్రశంసలు

అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ఘనంగా నిర్వహించిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల ప్రత్యేక అతిథిగా పాల్గొని సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ మహాసభల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా తనను తాను పరిచయం చేసుకున్న అనన్య నాగళ్ల.. తాను తెలంగాణకు చెందిన తెలుగు అమ్మాయినని, వకీల్ సాబ్, పొట్టేల్ తదితర చిత్రాల్లో నటించానని చెప్పారు. గత ఏడాది ఉత్తమ నటిగా ‘గద్దర్’ అవార్డు అందుకోవడం తనకు మరింత ప్రోత్సాహాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఆటా కన్వెన్షన్ గురించి ఇంతకుముందే చాలా విన్నానని, అయితే ప్రత్యక్షంగా వచ్చి ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని చూడడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వేలాది మంది తెలుగువారు ఒకే వేదికపై కలుసుకుని తమ భాష, సంస్కృతిని ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు.

ఇండియాలో కూడా ఇలాంటి భారీ ఈవెంట్‌ను ఇంత సమర్థవంతంగా నిర్వహించడం సవాలుతో కూడుకున్న విషయమేనని వ్యాఖ్యానించిన ఆమె, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలు తనను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. అమెరికాలో పెరుగుతున్న తెలుగు పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాలను నేర్చుకునేలా ఆటా వంటి సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అనన్య నాగళ్ల కొనియాడారు. భవిష్యత్ తరాలకు తెలుగు భాష, సంస్కృతిని చేరవేయడంలో ఇటువంటి మహాసభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

ManaTV Team