Find Articles

బాల్టిమోర్‌లో ఆటా మహాసభలు: తెలుగు సమాజ సేవను కొనియాడిన డేవిడ్ మిల్లర్

బాల్టిమోర్‌లో ఆటా మహాసభలు: తెలుగు సమాజ సేవను కొనియాడిన డేవిడ్ మిల్లర్

అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ భర్త డేవిడ్ మిల్లర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆటా కన్వెన్షన్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొంటూ, నిర్వాహకులు మరియు ఆటా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, తెలుగు సమాజ అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను అభినందించారు.
తన ప్రసంగంలో అరుణా మిల్లర్‌ను దూరదృష్టి కలిగిన నాయకురాలిగా అభివర్ణించిన డేవిడ్ మిల్లర్, రవాణా ఇంజినీర్‌గా ప్రారంభమైన ఆమె ప్రయాణం ప్రజాసేవలో ఉన్నత స్థాయికి చేరిందని అన్నారు. విద్య, కృషి, అంకితభావంతో ఆమె సాధించిన విజయాలు వలస కుటుంబాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అమెరికాలో తెలుగు మూలాలు కలిగిన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, కష్టపడి పనిచేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని సందేశమిచ్చారు. ప్రతి తరం తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజానికి తిరిగి సేవ చేయాలని సూచించారు.

ప్రభుత్వ విధానాల ప్రస్తావనలో మైనారిటీ వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సమాన అవకాశాలు కల్పించే ప్రొక్యూర్‌మెంట్ సంస్కరణలకు తెలుగు కమ్యూనిటీ అందించిన మద్దతును ఆయన ప్రస్తావించారు. అలాగే హైస్కూల్ పూర్తి చేసిన విద్యార్థులకు సేవా సంవత్సరం అవకాశాన్ని కల్పించే మేరీల్యాండ్ కార్యక్రమానికి కూడా తెలుగు అమెరికన్లు సహకరించారని తెలిపారు.

విద్యే వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక అభివృద్ధికి ప్రధాన మార్గమని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నారు. తాను జమైకా వలస కుటుంబానికి చెందిన వ్యక్తినని గుర్తుచేసుకుంటూ, గత తరాల త్యాగాల వల్లే నేటి తరానికి ఈ స్థాయి అవకాశాలు లభించాయని అన్నారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అమెరికా 250వ వార్షికోత్సవాన్ని ప్రస్తావిస్తూ, దేశ నిర్మాణంలో వివిధ వలస సమాజాల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. తెలుగు అమెరికన్లు కూడా తమ ప్రతిభ, సేవలతో అమెరికా అభివృద్ధిలో విశిష్ట ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. సమాజం ఐక్యంగా ముందుకు సాగుతూ, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ManaTV Team