అమెరికాలోని అట్లాంటాలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, JITO యూఎస్ఏ అట్లాంటా ఆధ్వర్యంలో ‘జర్నీ టు సక్సెస్’ కార్యక్రమం నిర్వహించారు.
వ్యాపార రంగంలో విజయాలు సాధించాలనుకునే ఔత్సాహికులకు స్ఫూర్తినిచ్చేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రముఖ వ్యాపారవేత్తలు మహేంద్ర బాప్నా, షిరీష్ గాంధీ, దీపక్ షా పాల్గొని తమ వ్యాపార అనుభవాలను, జీవిత పాఠాలను పంచుకున్నారు. రాజేన్ షేత్ చర్చకు మార్గనిర్దేశం చేశారు.
వ్యాపారంలో విజయం సాధించాలంటే కస్టమర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, నాణ్యమైన సేవలను అందించడం ఎంతో ముఖ్యమని వారు వివరించారు. కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించుకోవడంతో పాటు మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం, నెట్‌వర్కింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం దీర్ఘకాలిక విజయానికి కీలకమని పేర్కొన్నారు.
అదేవిధంగా, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవడం ద్వారా పనులను మరింత సమర్థవంతంగా పూర్తి చేయవచ్చని వివరించారు.
వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను చూసి వెనకడుగు వేయకుండా, ఆలోచనాత్మకంగా రిస్క్ తీసుకుంటూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అపజయాలను కూడా పాఠాలుగా తీసుకుని ముందుకు సాగినప్పుడే విజయానికి బాటలు పడతాయని తెలిపారు.
అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తల ఆలోచనలు, అనుభవాలు యువతకు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఎంతో స్ఫూర్తినిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అతిథులు, స్పాన్సర్లు, భాగస్వాములు, నిర్వాహకులు, వాలంటీర్లకు జైటో యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ కృతజ్ఞతలు తెలిపింది.
నేర్చుకోండి.. అనుసంధానం అవ్వండి.. స్ఫూర్తి పొందండి.. కలిసి ఎదగండి.. అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.