Find Articles

న్యూయార్క్‌లో ఘనంగా NYTTA అలయ్ బలయ్ వేడుకలు

న్యూయార్క్‌లో ఘనంగా NYTTA అలయ్ బలయ్ వేడుకలు

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో అలయ్ బలయ్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరయ్యారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయతను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ తెలుగు సంఘం (TTA) వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ జానపద గీతాలు, ప్రముఖ గాయకుడు మిట్టపల్లి సురేందర్ ఆలపించిన బతుకమ్మ పాటలు, వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి కోమలి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ప్రముఖులు, దాతలు, కళాకారులు, సామాజిక సేవకులను నిర్వాహకులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ముఖ్య అతిథులు, TTA నాయకులు, దాతలు, స్పాన్సర్లు, కళాకారులు, వాలంటీర్లు, మీడియా ప్రతినిధులు, హాజరైన తెలుగు కుటుంబాలందరికీ NYTTA అధ్యక్షుడు రవీందర్ కోడెల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ కొనసాగిస్తూ, తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ అలయ్ బలయ్ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.

ManaTV Team