అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం డెట్రాయిట్ ప్రాంతంలో ప్రవాస తెలుగు కుటుంబాలు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నాయి. ‘దివాళి ఫ్యూజన్ 2026’ పేరుతో నిర్వహించిన ఈ సాంస్కృతిక వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సందడిగా సాగాయి.
కాంటన్‌లోని ‘Authentikka Indian Restaurant’ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమం స్థానిక తెలుగు ఎన్నారైలలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
ఈ వేడుకల్లో ప్రముఖ కళాకారుడు మిమిక్రీ రమేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన అద్భుతమైన గొంతుల అనుకరణతో ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తారు. సీనియర్ సినీ నటుల డైలాగ్ డెలివరీ నుంచి నేటి రాజకీయ నాయకుల పంచ్‌ల వరకు విభిన్న గొంతులను అనుకరిస్తూ అందరినీ అలరించారు.
ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా స్వదేశానికి దూరంగా ఉంటున్న ప్రవాస భారతీయులకు ఆయన ప్రదర్శన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసింది.
కేవలం నాలుగు రోజుల్లోనే ఇంతటి భారీ వేడుకను పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేసి విజయవంతం చేయడంపై హాజరైన ఎన్నారైలు నిర్వాహకులను అభినందించారు.
అనంతరం నిర్వాహక బృందం మిమిక్రీ రమేష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేసింది.