
IND A vs AFG A: శ్రీలంకలో పర్యటిస్తున్న ఇండియా ఏ జట్టుకు అఫ్ఘానిస్తాన్ జట్టు షాక్ ఇచ్చింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఘన విజయం సాధించిన భారత్ ఏ జట్టు అఫ్ఘాన్ చేతిలో మాత్రం పరాజయం చవిచూసింది. గురువారం దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ జట్లు నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్లకు 349 పరుగుల భారీ స్కోర్ చేసింది.
చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ(22 బంతుల్లో 9 ఫోర్లతో 44) దూకుడుగా ఆడగా.. ప్రభ్ సిమ్రాన్ సింగ్(69 బంతుల్లో 14 ఫోర్లతో 84) అదరగొట్టాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్(80 బంతుల్లో 3 ఫోర్లతో 66), తిలక్ వర్మ(73 బంతుల్లో 5 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక చివర్లో సూర్యన్ష్ షెడ్గే(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) మెరుపులు మెరిపించారు. దీంతో ఇండియా ఏ జట్టు భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో అబ్డోల్లా అహ్మద్జాయ్ (5/68) ఐదు వికెట్లు తీయగా.. ఫర్మానుల్లా(3/85) మూడు వికెట్లు పడగొట్టాడు. ఇమ్రాన్‌కు ఒక వికెట్ దక్కింది.అయితే వర్షం అంతరాయంతో అఫ్గాన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.
294 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ తొలి నుంచి దూకుడుగా ఆడింది. కానీ మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి అఫ్గానిస్థాన్ 25.5 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆట కొనసాగే అవకాశాలు లేకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఫలితాన్ని తేల్చారు. దీని ప్రకారం అఫ్గాన్ మూడు పరుగులు అదనంగా చేయడంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు.
కెప్టెన్ ఇమ్రాన్(70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75 నాటౌట్), బహిర్ షా(52 బంతుల్లో 5 ఫోర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత్-ఏ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్ తలో వికెట్ తీశారు. భారత్-ఏ తన తర్వాతి మ్యాచ్‌ను సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఆడనుంది.

