అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు బాల్టిమోర్‌లో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రెడ్డి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సంస్థ భవిష్యత్ కార్యాచరణతో పాటు సేవా కార్యక్రమాలపై తన దృక్పథాన్ని వెల్లడించారు.
ఆటా మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక తెలుగు సంస్థ అని పేర్కొన్న సతీష్ రెడ్డి, కేవలం 100 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు వేలాది మంది సభ్యులతో మహావృక్షంలా ఎదిగిందని చెప్పారు. భాష, సంస్కృతి, సేవ అనే మూడు ప్రధాన స్తంభాలపై ఆటా ప్రయాణం కొనసాగుతోందని, గత 36 ఏళ్లుగా తెలుగు భాషా సంస్కృతులను భావితరాలకు చేరవేయడంలో సంస్థ విశేష కృషి చేస్తోందని తెలిపారు.
అమెరికాలో నివసిస్తున్నప్పటికీ మాతృభూమిని మరవకుండా తెలుగు రాష్ట్రాల్లో గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, ఆరోగ్య సేవలు వంటి అనేక సామాజిక కార్యక్రమాలను ఆటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వివరించారు. అదే సమయంలో అమెరికాలోని స్థానిక కమ్యూనిటీల కోసం కూడా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
గత రెండేళ్లలో ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో 150కు పైగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని సతీష్ రెడ్డి తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న దాదాపు 17 లక్షల మంది తెలుగువారికి, ముఖ్యంగా ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆటా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తనను ప్రెసిడెంట్-ఎలెక్ట్‌గా ఎన్నుకున్న ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, మాజీ అధ్యక్షులు చూపిన మార్గంలో నడుస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. అలాగే 19వ ఆటా మహాసభలను విజయవంతం చేయడంలో అంకితభావంతో పనిచేసిన కాన్ఫరెన్స్ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, స్పాన్సర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తదుపరి 20వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు 2028లో అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించనున్నట్లు సతీష్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సభికులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.