అమెరికాలో జరగనున్న 19వ అమెరికా తెలుగు సంఘం (ATA) మహాసభల్లో ఈసారి బిజినెస్ సమ్మిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న ఈ మహాసభల్లో వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రత్యేక బిజినెస్ సెషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సదస్సులో అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ కార్పొరేట్ నాయకులు, పారిశ్రామికవేత్తలు ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాపార రంగంలో తాజా అవకాశాలు, సాంకేతిక మార్పులు, నాయకత్వం, పెట్టుబడులపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
అలాగే స్టార్టప్‌లు, పెట్టుబడులు, వ్యాపార విస్తరణ, విలీనాలు–కొనుగోళ్లు (Mergers & Acquisitions) వంటి కీలక అంశాలపై ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని యువ పారిశ్రామికవేత్తలకు సూచనలు, వ్యాపార వ్యూహాలపై అవగాహన కల్పించనున్నారు.
అటా బిజినెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సు ద్వారా అమెరికాలోని తెలుగు వ్యాపారవేత్తల మధ్య నెట్‌వర్కింగ్‌ను పెంపొందించడంతో పాటు, కొత్త వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ బిజినెస్ సెషన్లకు అటా బిజినెస్ కమిటీ చైర్మన్ అనిల్ బోయినపల్లి మోడరేటర్‌గా వ్యవహరించనున్నారు.