
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన నిజాలు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు. ఆమె లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’ ప్రమోషన్స్ సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సినిమా కథ, దానికి సంబంధించిన రీసెర్చ్ డాక్యుమెంట్స్ తన వద్దకు వచ్చినప్పుడు దేశంలోని నిజా నిజాలు చూసి షాక్ అయినట్లు కాజల్ తెలిపారు. మన చుట్టూ ఉన్న నిజాలను పట్టించుకోకుండా, మనకు నచ్చిన చిన్న ప్రపంచంలో బతికేస్తున్నాం. కానీ, నిజానికి ఇది ముమ్మాటికీ కపటత్వమే అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భయంకరమైన నిజాన్ని సమాజానికి చూపించాల్సిన, దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించానని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఇందులో మొదటి అడుగన్న కాజల్ అగర్వాల్.. ఏదైనా ఒక సమస్య గురించి తెలిసినప్పుడే కదా, దానిని పరిష్కరించడానికి మనం ముందడుగు వేస్తామని చెప్పారు. ఈ స్టోరీ తన కళ్లు తెరిపించిందని తెలిపారు. అలాగే సమాజంలోని ఈ చేదు నిజం తనను తీవ్రంగా కలచివేసిందని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా పరిశోధనల్లో తెలిసిన విషయాల వల్ల తాను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపానని కాజల్ అగర్వాల్ వెల్లడించారు.
సామాజిక స్పృహతో కూడిన అంశంతో తెరకెక్కిన ‘ది ఇండియా స్టోరీ’ సినిమాకు స్వాతి వినాయక్ సైందానే, అనితా జాదవ్, వినాయక్ సైందానే, కల్పేష్ షా, దేవయాని ఖోరతే, ప్రేమ్ జోషిలు నిర్మాతలుగా వ్యవహరించారు. దేశంలో ఆహార రంగంలోని లోపాలను, కల్తీ మాఫియా గుట్టును రట్టు చేసేలా రూపొందిన ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

